Dr. BR Ambedkar: వాడవాడలా ఘనంగా అబేంద్కర్ జయంతి..! 11 d ago

ఆయన అణగారిన వర్గాల బతుకులు మార్చారు.
ఆయన మూగబోయిన గొంతులకు ఊపిరి పోశారు.
ఆయన అంటరానితనాన్ని రూపుమాపారు.
ఆయన కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడారు.
ఆయనే రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్.
బీఆర్ అంబేడ్కర్.. పూర్తి పేరు భీంరావ్ రాంజీ అంబేడ్కర్. ఆయన మహర్ కులానికి చెందిన వారు. అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్‌లో జన్మించారు. దళితుడు అనే కారణంతో ఆయన చిన్నతనంలోనే అనేక అవమానాలు ఎదుర్కొన్నారు. కులవివక్ష కారణంగా ఒకానొక సమయంలో కనీసం ఆయనకు తాగడానికి మంచినీరు కూడా ఇవ్వలేదు. అంతేకాకుండా పక్కనే ఉన్న మురికి గుంటలో ఉన్న నీరు తాగు అని అవమానించారు. ఏదైనా తాకితే అది మైలుపడుతుందని అంబేడ్కర్‌ను దూరంగా ఉంచేవారు. చివరికి ఆయన ఉండేందుకు ఇల్లు కూడా అద్దెకు ఇవ్వలేదు. చేసేది ఏమీ లేక ఒక సత్రంలో ఉండేవారు. అంబేద్కర్ మహర్ కులానికి చెందిన వారు అని తెలిసి అక్కడ నుంచి కూడా పంపేశారు.
ఎన్నో ఘోర అవమానాలు ఎదుర్కొన్న అంబేడ్కర్ 1927 నుంచి అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత దళితుల మహా సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు దేశం నలుమూలల నుంచి వేలాదిగా దళితులు తరలివచ్చారు. బడిలోకి, గుడిలోకి దళితులు వెళ్లేందుకు పోరాటం చేశారు. అట్టడుగు వర్గాల సేవ కోసం బోధించు, సమీకరించు, పోరాడు అనే సిద్ధాంతాలతో అంటరానితనం, కులమతాలు లేని సమాజం కోసం కృషి చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కేంద్రంలో మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా పని చేశారు. అంతేకాకుండా భారత రాజ్యాంగం రాసే అవకాశం దక్కింది.
వివిధ రకాల భాషలు, ఆచారాలు, కులాలు, మతాలు ఉన్న ఈ దేశం ఆయన రాసిన రాజ్యాంగంతోనే ఇప్పుడు నడుస్తోంది. ఆయన కేవలం దళితుల కోసమో, రిజర్వేషన్ల కోసమో మాత్రమే కాకుండా మహిళలు, పురుషులకు సమాన జీతాలు, పని సమయాన్ని 12 ఉంచి 8 గంటలు చేయాలని, స్రీలకు ఆస్తి హక్కు కల్పించాలని పోరాడారు. ఆయన పూనుకోపోతే ఇప్పటికీ బడుగుబలహీన వర్గాల బతుకులు చీకటిలోనే మగ్గిపోయేవి. అందుకే అంబేడ్కర్ చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం 1990లో భారతరత్న ప్రకటించింది. ది గ్రేటేస్ట్ ఇండియన్‌గా పేరుపొందారు. అంబేడ్కర్ మరణించినా.. భారత రాజ్యాంగం వల్ల అనగారిన వర్గాల చీకటి బతుకుల్లో వెలుగులు నిండాయి. బానిసత్వం నసించి దేవాలయాలు, విద్యాలయాల్లో పేదలు ప్రవేశించి ఉన్నత చదువులు చదువుకుంటున్నారు. అంటరానితనాన్ని తరిమికొట్టి మూగబోయిన గొంతులకు అంబేడ్కర్ జీవం పోశారు. అందుకే వేలాది మంది గుండెల్లో ఆయన దేవుడిగా కొలువై ఉన్నారు.